'ఇలాగైతే అసాంజే జైలులోనే మరణిస్తారు'
లండన్ : వికీలీక్స్ వ్యవస్ధాపకుడు జులియన్ అసాంజే ఆరోగ్యం సరిగా లేదని, విచారణ పేరిట వేధింపులు కొనసాగితే బ్రిటిష్ జైలులోనే ఆయన మరణించవచ్చని 60 మందికి పైగా వైద్యులు బ్రిటన్ హోం సెక్రటరీకి రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. అసాంజేకు తక్షణమే శారీరక, మానసిక వైద్య చికిత్సలు అవసరమని తేల్చిచెప్పారు. గూఢచర్య ఆరోపణలపై అసాంజేను తమకు అప్పగించాలని బ్రిటన్‌ను అమెరికా కోరుతోంది. గూఢచర్యం చట్టం కింద అసాంజేపై ఆరోపణలు నిగ్గుతేలితే అమెరికన్ జైలులో ఆయన 175 ఏళ్లు మగ్గవలసి ఉంటుంది.
అసాంజేను ఆరోగ్య కారణాలతో బెల్మార్ష్ జైలు నుంచి యూనివర్సిటీ టీచింగ్ ఆస్పత్రికి తరలించాలని హోం సెక్రటరీ ప్రీతిపటేల్, బ్రిటన్ దేశీయాంగ మంత్రికి రాసిన లేఖలో వైద్యులు కోరారు. లండన్‌లో అక్టోబర్ 21న కోర్టుకు హాజరైన సందర్భంగా అసాంజేను చూసినవారు వెల్లడించిన వివరాలతో పాటు ఆయన ఎదుర్కొంటున్న వేధింపులపై ఐరాస ప్రతినిధి నిల్స్ మెల్జర్ నివేదిక ఆధారంగా తాము ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. అసాంజేపై విచారణ పేరుతో వేధింపులు కొనసాగితే ఆయన జీవితం అంతమయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హక్కుల నిపుణులు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. 2010లో ఆప్ఘనిస్తాన్, ఇరాక్‌లలో అమెరికా దాడులకు సంబంధించిన సైనిక దౌత్య ఫైళ్లను అసాంజే వికీలీక్స్‌లో ప్రచురించడంతో అమెరికా ప్రభుత్వంలో ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.